Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితం అయ్యింది. దీంతో గుజరాత్ 55 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముంబైలోని ప్రధాన బ్యాటర్లందరూ ఘోరంగా విఫలం అవ్వడంతో, ఆ జట్టు ఇంత చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొంతలో కొంత నేహాల్ వాధేరా (40), గ్రీన్ (33) పర్వాలేదనిపించారంతే. మిగతా వాళ్లు ఘోర ప్రదర్శనతో తీవ్ర నిరాశపరిచారు. సూర్యకుమార్ యాదవ్ పలు షాట్లతో ఊరించాడు కానీ, ఆ తర్వాత ఉసూరుమనిపించాడు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (56) అర్థశతకంతో చెలరేగగా డేవిడ్ మిల్లర్ (46), అభినవ్ మనోహర్ (42) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో రాహుల్ తెవాతియా కేమియో కూడా అదిరింది. అతడు కేవలం 5 బంతుల్లోనే మూడు సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు సైతం తమవంతు సహకారం అందించడంతో గుజరాత్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. ఆది నుంచే చెత్త ప్రదర్శన కనబర్చింది. పవర్ ప్లేలో దుమ్మరేపుతారని అనుకున్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్.. టెస్ట్ ఇన్నింగ్స్ ఆడి బంతులు వృధా చేశారు. రోహిత్ 8 బంతులు ఆడి 2 పరుగులే చేస్తే ఇషాన్ కిషన్ 21 బంతులు ఆడి 13 పరుగులే చేశాడు.