Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లోని ఓ ఉన్నత పాఠశాలలో భయానక ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ దుండగుడు తుపాకీతో హల్చల్ చేశాడు. విద్యార్థులను, ఉపాధ్యాయులను బెదిరింపులకు గురి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్దా జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలలోకి గుర్తు తెలియని ఓ యువకుడు ప్రవేశించాడు. 8వ తరగతి గదిలోకి చొరబడి తన వెంట తెచ్చుకున్న రెండు సీసాలను టేబుల్‌పై ఉంచాడు. అనంతరం తుపాకీతో హల్చల్ చేశాడు. ఆ సమయంలో విద్యార్థులు తరగతి గదిలోనే ఉన్నారు. దుండగుడు తుపాకీ చూపిస్తూ విద్యార్థులను, క్లాస్ టీచర్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేశాడు. దీంతో పాఠశాల ఆవరణలో భయాందోళన పరిస్థితి నెలకొంది. దుండగుడు కాల్చేస్తాడేమోనని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయభ్రాంతులకు లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అడ్డుకుని అరెస్టు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.