Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అచ్చంపేట: అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో సహజ ప్రసవం కోసం నిండు గర్భిణిని చిత్రహింసలు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి కథనం ప్రకారం వివరాలివి.. నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రానికి చెందిన మంజుల ప్రసవ వేదనతో ఈ నెల 25న అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం సాధారణ ప్రసవం చేసేందుకు గదిలోకి వెళ్లిన వైద్యురాలు, సిబ్బంది ఆమె చేతులను పట్టుకుని, కడుపుపై కొడుతూ ప్రసవం చేశారు. ఆడ శిశువు స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండగా వైద్యుల సిఫార్సు మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు తరలించారు. అప్పటికే చనిపోయిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో అచ్చంపేట ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రసవం చేసిన వైద్యురాలు, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ డా. కృష్ణ వారిని సముదాయించారు. పదర జడ్పీటీసీ సభ్యుడు రాంబాబునాయక్, భాజపా, ఎమ్మార్పీఎస్ నేతలు శ్రీకాంత్ భీమ, కాసిం, ప్రజా సంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు.