Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 21 పరుగుల తేడాతో కేకేఆర్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 200/5 స్కోరు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు 179/8 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. తొలుత బౌలింగ్‌లోనూ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో విఫలమైన తమ జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయిందని ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తామే కేకేఆర్‌కు మ్యాచ్‌ను అప్పగించామన్నాడు. ఫీల్డింగ్‌లోనూ వచ్చిన సులువైన క్యాచ్‌లను చేజార్చుకొని ఓడిపోయామని తెలిపాడు.
‘‘నిజాయతీగా చెప్పాలంటే కోల్‌కతాకు మేమే మ్యాచ్‌ను అప్పగించాం. ఓటమికి పూర్తిగా అర్హులం. ప్రొఫెషనల్ క్రికెట్‌ను ఆడలేకపోయాం. బౌలింగ్ ఫర్వాలేదనిపించినా.. ఫీల్డింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాం. మ్యాచ్‌లోని నాలుగైదు ఓవర్లపాటు క్యాచ్‌లను మిస్ చేసుకున్నాం. దీంతో కనీసం 25-30 పరుగులు అదనంగా సమర్పించుకొన్నాం. లక్ష్య ఛేదనలో కుదురుకున్నట్లు అనిపించినా.. ఒక్కసారిగా వికెట్లను చేజార్చుకోవడంతో వెనుకబడిపోయాం. అవేవీ వికెట్లను తీసే బంతులు కూడా కాదు. మేమే నేరుగా ఫీల్డర్ల వద్దకు కొట్టి వికెట్లను పారేసుకున్నాం. మహిపాల్‌తో కలిసి నేను నిర్మించిన భాగస్వామ్యం మాదిరిగా మరొకటి లభిస్తే గెలిచే అవకాశం ఉండేది. అలా జరగలేదు. సొంతమైదానంలో ఓడిపోవడం కూడా తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఇక నుంచి బయట వేదికల్లో జరిగే మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన అవసరం ఉంది’’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.