Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముంబై: మామిడి కాయల కోసం చెట్టు ఎక్కిన వైద్య విద్యార్థి జారి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో వైద్య విద్యార్థులు నిరసనకు దిగారు. సకాలంలో చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి యాజమాన్యంపై మండిపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ధారశివ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల దయానంద్ కాలే, ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న పోదర్ ఆయుర్వేద్ మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. బీఏఎంఎస్ విద్యనభ్యసిస్తున్న అతడు బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో క్యాంపస్‌లోని మామిడి చెట్టు ఎక్కాడు. మామిడి కాయలు తెంచేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా జారి మామిడి చెట్టుపై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు. కాగా, వైద్య విద్యార్థి దయానంద్ కాలే అకాల మరణంపై ఆయుర్వేద వైద్య కాలేజీ విద్యార్థులు గురువారం నిరసనకు దిగారు. ఆయుర్వేద హాస్పిటల్లో వైద్య సేవలను నిలిపివేశారు. సకాలంలో వైద్యం అందించకపోవడం, హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం దయానంద్ మరణానికి కారణమని వైద్య విద్యార్థులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.