Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పేదలకు ఇళ్ళస్థలాల పట్టాలివ్వడానికి విడుదల చేసిన జిఓ నెం.58, 59 గడువు 30 ఏప్రిల్ 2023తో ముగియనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలు తెలియజేస్తున్నాయి. మిగులు భూములు, ప్రభుత్వ భూములలో 2020 జూన్ 2కి ముందు వాస్తవ అధీనంలో ఉన్న పేదలకు పట్టాలివ్వడానికి ఇచ్చిన గడువును పొడిగించాలని, ఇప్పటికే దరఖాస్తులు పూర్తిచేసుకున్నవారందరికీ వెంటనే పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మీసేవా కేంద్రంలో దరఖాస్తుల కోసం ఇచ్చిన గడువులో, ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ మరియు ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు జీఓ నెం.58 ప్రకారం గ్రామాలలో 1.50లక్షల మంది, జీ.ఓ నెం.59 ప్రకారం పట్టణాలలో 42వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్టు ప్రకటించారు. 125 గజాల లోపు ఉన్నవారు ఉచితంగా పట్టా పొందడానికి మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ జీ.ఓ ప్రకారం, 126 నుండి 250గజాలున్నవారు రిజిస్ట్రేషన్ ధరలో 50శాతం చెల్లించాలి. 251 గజాల నుండి 500 గజాల వరకు ఉన్నవారు, 75శాతం, 500 నుండి 1000 గజాలు స్వాధీనంలో ఉన్నవారు 100శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాలి. ఇందుకు ఆధార్‌కార్డు గానీ, కరెంటు బిల్లుగానీ లేదా గ్రామపంచాయితీ/మున్సిపాలిటీకి చెల్లించిన రసీదులు జతపర్చాలి. పై ఆధారాలేవీ లేనివారు వేలసంఖ్యలో ఉన్నారు. కావున, భౌతికంగా సర్వే నిర్వహించి 2020 జూన్ 2ముదు స్వాధీనంలో ఉన్న పేదలకు వారి స్థితిని బట్టి పట్టాలు మంజూరు చేయాలి. గ్రామీణ ప్రాంతాలలో మీ సేవా కేంద్రాలు లేకపోవడం, ఉన్నా సరిగా పనిచేయకపోవడంతో చాలామంది వినియోగించుకోలేకపోతున్నారు. ఆన్లైన్లో నింపడం రాక కూడా దరఖాస్తులు చేసుకోలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో ప్రధానంగా దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతుల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో తహశీల్దార్లు, సిబ్బంది స్వయంగా సర్వే చేసి, ప్రభుత్వ భూమిలో లేదా మిగులుభూములలో 125 చ.గ.జ స్థలంలో ఇండ్లు నిర్మాణం చేసుకున్నవారి నుండి దరఖాస్తులు తీసుకుని జిఓ నెం.58 అమలు చేసే విధానాన్ని అమలుచేయాలి. మిగిలిన ప్రాంతాలలో కూడా అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా తహశీల్ కార్యాలయాలకు బాధ్యత పెట్టడం ద్వారా ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. అందుకనుగుణంగా జి.ఓ గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) కోరుతున్నది.