Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాగల నాలుగు రోజుల్లో తెలంగాణ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో దిగువస్థాయిలో గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో చాలాచోట్ల వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గురువారం రాత్రి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 30, మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయని వివరించింది. క్యుములోనింబస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 36.8, భద్రాచలం 36.6, హనుమకొండ 33, హైదరాబాద్ 32.7, ఖమ్మం 36.6, మెదక్ 32.6, నల్లగొండ 37, నిజామాబాద్ 35.2, రామగుండం 36.4 డిగ్రీల చొప్పున నమోదైనట్లు వాతావరణ కేంద్రం వివరించింది.