Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: తుకారాంగేట్ పోలీసుల అదుపులోని నిందితుడు చిరంజీవి మృతి చెందడంపై హైకోర్టు స్పందించింది. పత్రికల్లో కథనాల ఆధారంగా అనుమానాస్పద కస్టోడియల్ మృతి కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీపీ, నార్త్ జోన్ డీసీపీ, గోపాలపురం ఏసీపీ, తుకారాంగేట్ ఎస్‌హెచ్‌వోను ప్రతివాదులుగా చేర్చింది. ఇటీవల ఓ చోరీ కేసులో నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన చిరంజీవిని పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. కేసుపై విచారిస్తుండగా నిందితుడు కుప్పకూలాడు. ఆస్పత్రి తరలిస్తుండగా చనిపోయాడు. అయితే పోలీసులే కొట్టి చంపారంటూ చిరంజీవి కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. నిందితుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. పోలీసులు కొట్టడంతోనే మరణించాడని ఆరోపిస్తున్నారు. దీనిపై వార్తా పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమవ్వడంతో వాటి ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది.