Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం టీపీసీసీ ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. ఇక్కడ సుమారు వెయ్యి మంది నిరుద్యోగులు చేతిలో చిప్పలు పట్టుకుని నిరసన తెలపనున్నారు. అనంతరం నల్లగొండ బైపాస్ నుంచి నల్లగొండ పట్టణం వరకు మూడు కిలోమీటర్ల మేర నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. తర్వాత పెద్ద గడియారం సెంటర్లో సభ నిర్వహించనున్నారు. నల్లగొండలో ఈనెల 21న నిరసన ర్యాలీ నిర్వహించాలని ముందుగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ కార్యక్రమంపై తమకు సమాచారం లేదని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలపగా, ఈ కార్యక్రమం గురించి తనతో ఎవరూ చర్చించలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ ఉత్తమ్ ఓ అడుగు ముందుకేసి ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ పెద్దలు రాష్ట్ర నేతలతో చర్చించి ఈ నెల 28న ముహూర్తం ఖరారు చేశారు. ఈ తరుణంలో ఉత్తమ్, వెంకట్‌రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరవుతారా? లేదా? అన్న సందగ్ధత గురువారం సాయంత్రం వరకు నెలకొన్నా.. తాము సభకు హాజరవుతున్నామని రాత్రి వారిద్దరూ తెలిపారు. ఈ మేరకు వారిద్దరూ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌కు సమాచారం అందించారు.