Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలకు విజయవాడలోని పోరంకి సిద్ధమైంది. అనుమోలు గార్డెన్స్‌లో నేడు ప్రారంభం కానున్న ఈ వేడుకల కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. సభా ప్రాంగణాన్ని మూడు భాగాలుగా విభజించారు. ‘ఎన్’ విభాగంలో విశిష్ఠ అతిథులు, ‘టి’ విభాగంలో అతిథులు, ‘ఆర్’ విభాగంలో సామాన్యులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అలాగే, వేడుకలకు హాజరయ్యే వారి కోసం నాలుగైదు చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 4.30 గంటల నుంచి గ్యాలరీల్లోకి ప్రజలను అనుమతిస్తారు. ప్రాంగణం చుట్టూ మరో 20 వేల మంది వరకు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాల సావనీర్‌ను విడుదల చేస్తారు. అలాగే, ఎన్టీఆర్‌పై ప్రముఖ జర్నలిస్టు వెంకటనారాయణ రాసిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు.
ప్రధాన ఆకర్షణగా రజనీకాంత్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ నేడు నగరానికి రానున్నారు. అలాగే, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సహా పలువురు నేతలు హాజరవుతారు.