Authorization
Sat April 12, 2025 02:19:31 am
నవతెలంగాణ - బీహార్
బీహార్‌కు చెందిన జేడీయూ సీనియర్ నేత కైలాశ్ మహతో హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు గురువారం పొద్దుపోయాక ఆయనను కాల్చి చంపారు. కటిహార్ జిల్లాలోని బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఇంటికి సమీపంలో జరిగిందీ ఘటన. 70 ఏళ్ల కైలాశ్‌పై దుండగులు అతి సమీపం నుంచి పలుమార్లు కాల్పులు జరిపారు. ఆయన పొట్ట, తలలోకి తూటాలు చొచ్చుకెళ్లాయి. భూ తగాదానే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, భద్రత కల్పించాలని కైలాశ్ కొన్ని రోజుల క్రితమే అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అంతలోనే ఈ హత్య జరగడం గమనార్హం. కైలాశ్ హత్యపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని కటిహార్ ఎస్డీపీవో ఓం ప్రకాశ్ తెలిపారు. నిందితులు ఆయనపై నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు చెప్పారు.