Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. అయితే రెండోసారి ధర్నా చేపట్టడం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా ఈ ఘటనపై స్పందించారు. రెజ్లర్ల సమస్య పరిష్కారం కోసం అధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని నీరజ్ కోరారు.
న్యాయం కోసం వీధుల్లో రెజ్లర్లు ధర్నా చేయడం తన గుండెను కలిచివేస్తున్నట్లు జావెలిన్ త్రోయర్ నీరజ్ తన ట్వీట్లో తెలిపారు. దేశ తరపున పోటీ పడేందుకు ఆ అథ్లెట్లు ఎంతో కృషి చేశారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని, ప్రతి ఒక్క పౌరుడి సమగ్రతను, మర్యాదను కాపాడే బాధ్యత మనదే అని, ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు ఇక ఎప్పుడూ జరగకూడదని, ఇది చాలా సున్నితమైన అంశమని, చాలా పారదర్శకంగా ఈ సమస్యను పరిష్కరించాలని నీరజ్ తన ట్వీట్లో కోరారు. అథ్లెట్లకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మేటి రెజ్లర్లు వినోశ్ పోగట్, సాక్షీ మాలిక్, భజరంగ్ పూనియాతో పాటు అనేక మంది టాప్ రెజ్లర్లు ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల అథ్లెట్లకు మద్దతుగా ఒలింపిక్ మెడలిస్టు అభినవ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు.