Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాషింగ్టన్: స్కూల్ బస్సు నడుపుతున్న మహిళా డ్రైవర్ ఉన్నట్టుండి స్పృహ తప్పింది. గమనించిన ఒక విద్యార్థి వెంటనే స్పందించాడు. ముందుకు వచ్చి స్టీరింగ్ పట్టుకుని బస్సు బ్రేకులు నొక్కిపెట్టి దానిని నిలిపివేశాడు. ఆ బస్సులోని 66 మంది స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా కాపాడాడు. దీంతో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి సాహసాన్ని ఆ స్కూల్ యాజమాన్యంతో పాటు అంతా ప్రశంసించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుధవారం అమెరికాలోని మిచిగాన్‌లో వారెన్ కన్సాలిడేటెడ్ స్కూల్‌కు చెందిన బస్సులో 66 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సు నడువుపుతున్న మహిళా డ్రైవర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది. స్కూల్ బస్సును నడపలేని స్థితిలో ఉన్న ఆమె ఈ విషయాన్ని సంబంధిత రవాణా సంస్థకు తెలిపింది. అనంతరం బస్సును నిలిపేందుకు ప్రయత్నిస్తూ స్పృహ తప్పింది. కాగా, ఆ స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్న 7వ తరగతి విద్యార్థి డిల్లాన్ రీవ్స్, డ్రైవర్ పరిస్థితిని గమనించాడు. సహాయం కోసం వెంటనే ముందుకు వచ్చాడు. స్టీరింగ్ పట్టుకుని బ్రేకులపై కాలు నొక్కిపెట్టి స్కూల్ బస్సు నిలిచేలా చేశాడు. ఆ వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ మిగతా విద్యార్థులకు చెప్పాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆ బస్సు వద్దకు వచ్చారు. స్పృహ తప్పిన మహిళా డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. మరో స్కూల్ బస్సును రప్పించి విద్యార్థులను వారి ఇళ్లకు పంపారు. మరోవైపు విద్యార్థి డిల్లాన్ రీవ్స్ చొరవ వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పోలీస్ అధికారి తెలిపారు.