Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆరు రోజుల నుంచిధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా అథ్లెట్లతో బ్రిజ్ భూషణ్ ప్రవర్తన సరిగా లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ.. క్రికెటర్ల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం పట్ల రెజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. దేశంలోని అగ్రశ్రేణి క్రికెటర్లపై అసంతృప్తి వెల్లగక్కారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ వంటి గేమ్స్‌లో అథ్లెట్లు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టే క్రికెటర్లు.. ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. 'దేశం మొత్తం క్రికెట్‌ను ఆరాధిస్తోంది. కానీ, ఒక్క క్రికెటర్ కూడా మా ఆందోళనపై మాట్లాడటం లేదు. పతకాలు గెలిచినప్పుడు చప్పట్లతో అభినందిస్తూ పోస్టులు పెట్టేవారు. కానీ ప్రస్తుతం ఒక పెద్ద ఆందోళన జరుగుతుంటే మాత్రం మొహం చాటేశారు. వ్యక్తిగతంగా ఇది నన్నెంతో బాధిస్తోంది. మీరు రెజ్లర్లకు అనుకూలంగా మాట్లాడమని మేం చెప్పట్లేదు. కనీసం న్యాయం జరగాలంటూ ఒక్క పోస్ట్ అయినా పెట్టమని అభ్యర్థిస్తున్నాం. క్రికెటర్ అయినా, బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినా, అథ్లెటిక్స్, బాక్సర్ అయినా ముందుకొచ్చి మాకు మద్దతు తెలపండి' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.