Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయంగా బలహీన పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్లు) ధర రూ.60 వేల దిగువకు పడిపోయింది. బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.420 తగ్గి రూ.59,980 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. గురువారం ట్రేడింగ్‌లో రూ.60,400 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర దిగి వచ్చింది. ఔన్స్ బంగారం ధర 1982 డాలర్లు పలికింది. అమెరికా పీసీఈ డేటా అంచనాల కంటే మెరుగ్గా నమోదు కావడంతో డాలర్ విలువ బలోపేతమైంది. ఫలితంగా శుక్రవారం ఆసియా మార్కెట్ల ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం ధర డౌన్‌ట్రెండ్ కొనసాగింది. 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.141 తగ్గి రూ.59,760 వద్ద నిలిచింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో జూలై డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్ ధర రూ.141 (0.24శాతం) తగ్గి రూ.59,760 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయంగానూ ఔన్స్ బంగారం ధర 0.42 శాతం తగ్గి 1990.60 డాలర్ల వద్ద ట్రేడయింది.
బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.570 తగ్గి రూ.74,600 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి 24.82 డాలర్ల వద్ద స్థిర పడింది.