Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల ప్రారంభ సభకు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ హాజరయ్యారు. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సభలో రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులోనే ప్రసంగించిన రజనీకాంత్... చాలారోజుల తర్వాత తెలుగులో మాట్లాడుతున్నానని, తన తెలుగులో తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఈ సభను చూస్తుంటే రాజకీయం మాట్లాడాలని అనిపిస్తోందని, కానీ, రాజకీయం మాట్లాడవద్దని అనుభవం చెబుతోందని తన మనసులో మాట వెల్లడించారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని కీర్తించారు. చంద్రబాబుతో తనకు 30 ఏళ్లుగా స్నేహం ఉందని వెల్లడించారు. చంద్రబాబు ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ ను హైటెక్ నగరంగా మార్చారని కొనియాడారు.
ఇటీవల చాలాకాలం తర్వాత హైదరాబాద్ ను సందర్శించాను. నేను హైదరాబాద్ లో ఉన్నానా... న్యూయార్క్ లో ఉన్నానా అనిపించింది. 20 ఏళ్ల కిందటే ఐటీ రంగం అభివృద్ధి గురించి చెప్పిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ఓడిపోయినా, గెలిచినా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ తపిస్తుంటారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే దేశంలో ఏపీ నెంబర్ వన్ అవడం ఖాయం. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును దీవిస్తుంది. అని రజనీకాంత్ పేర్కొన్నారు.