Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఫిలింనగర్, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, నాగారం, కీసర, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, చర్లపల్లి, నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్ సహా పలు ప్రాంతాల్లో ఈ ఉదయం ఒక్కసారిగా మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో నగరం అతలకుతలం అయ్యింది. ఇండ్లలోకి వర్షం నీరు భారీగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలు రోడ్లన్ని చేరువుల్ల మారాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరోవైపు రోడ్ల మీద పార్క్ చేసిన వాహనాలు కార్లు, బైక్‌లు సైతం ఈ వర్షానికి కొట్టుకుపోయాయి.
నగరంలో మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. కాగా, ఏపీ, తెలంగాణల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విదర్భ నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు కురుస్తాయని వివరించింది.