Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోల్‌కతా: గుజరాత్ టైటాన్స్ మరోసారి అదరగొట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి గత పరాభావానికి ప్రతీకారం తీర్చుకుంది. గుజరాత్‌కు వరుసగా ఇది మూడో విజయం. కోల్‌కతా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్ గిల్ (49; 35 బంతుల్లో 8 ఫోర్లు) త్రుటిలో అర్ధ శతకం చేజార్చుకున్నాడు. చివర్లో విజయ్ శంకర్ (51; 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (32; 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్, నరైన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్ (81; 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) దంచికొట్టాడు. చివర్లో రస్సెల్ (34; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. నారాయణ్ జగదీశన్ (19), వెంకటేశ్ అయ్యర్ (11), రింకు సింగ్ (19), నితీష్ రాణా (4) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమి 3, నూర్ అహ్మద్, లిటిల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్ వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు సమర్పించుకున్నాడు.