Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయ సౌధం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో 8 ఎకరాల మేర పచ్చదనం మధ్య తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సచివాలయాన్ని నిర్మించారు. 12వేల మంది కార్మికులు 3 షిఫ్టుల్లో శ్రమించి 10లక్షల 52 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో అద్భుత కట్టడాన్ని నిలబెట్టారు.
పార్లమెంట్ తరహాలో స్వాగత తోరణం, విశాలమైన అంతర్గత రోడ్లు, పార్కింగ్ స్థలాలు, శాశ్వత హెలీప్యాడ్, ఉద్యానవనాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థనామందిరాలు కొత్త సచివాలయంలో ఏర్పాటుచేశారు. విశాలమైన గ్రంథాలయం, క్యాంటీన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బ్యాంకు, పోస్టాఫీస్, డిస్పెన్సరీ, ఇండోర్ స్టేడియం, ఆర్టీసీ, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు, మీడియా సెంటర్.. ఇలా అన్ని హంగులతో సచివాలయ భవనం నిర్మించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో సీఎం కార్యాలయం, ప్రజాదర్బార్ నిర్వహణకు ‘జనహిత’పేరుతో కనీసం 250 మంది కూర్చునే హాలు, 25 మంది మంత్రులు, 30 మందికిపైగా అధికారులు కూర్చునే విధంగా క్యాబినెట్ హాలు, కలెక్టర్లతో సమావేశాల నిర్వహణకు 60 మంది కూర్చునే హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు... మొత్తం 25మంది కూర్చునే విధంగా అత్యాధునిక డైనింగ్ హాలు ఏర్పాటుచేశారు.