Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ వైద్యుడు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. స్పందించిన అధికారులు.. ఆ వైద్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసి, విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 9న హమీర్పుర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం తర్వాత సీఎం సుఖ్విందర్.. మూడు రోజులపాటు హమీర్‌పుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తల్లి ఫిర్యాదుపై చీఫ్ మెడికల్ అధికారిని ఆయన వివరణ కోరారు. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన వైద్యుడు తాను అసభ్యంగా ప్రవర్తించలేదని, రోగితోపాటు వచ్చిన కుటుంబసభ్యులను మాస్కులు ధరించమని మాత్రమే కోరినట్లు చెప్పారు. ఆ వృద్ధురాలు ఎవరో తనకు తెలియదని.. చికిత్స అనంతరం ఆమెకు మందులు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. త్రిసభ్య కమిటీ నివేదిక పరిశీలించాక తగు చర్యలు తీసుకొంటామని, ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.