Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయం నా చేతుల మీదుగా ప్రారంభించడం నా జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్త సచివాలయం ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో నూతన నిర్మించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడించారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ పల్లెలు కూడా వెలిగిపోతున్నాయని చెప్పారు.
పెద్ద పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగిందని, నీళ్లు రానే రావు.. సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని చెప్పారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాల్లో చేర్చారని అన్నారు. ఈ రోజు తెలంగాణ సాధించిన ప్రగతిలో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉంది. అనేక విభాగాలు కలిసి పని చేయడం వల్లే ప్రగతి సాధ్యమైందని వెల్లడించారు. అద్భుతమైన రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. మంత్రుల నుంచి సర్పంచ్ వరకు, సీఎస్ నుంచి గ్రూప్ -4 ఉద్యోగుల వరకు అందరికీ నమస్కరిస్తున్నానని చెప్పారు.
సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, సమీకరించు, బోధించు పోరాడు అని సందేశం ఇచ్చిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, వారి సందేశంతోనే గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. అంబేద్కర్ చూపిన మార్గంలోనే మన ప్రయాణం కొనసాగుతున్నదని, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వులు రావాలన్న అంబేద్కర్ స్ఫూర్తిని అందుకుని 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నామన్నారు. అనునిత్యం అంబేద్కర్ స్ఫురణకు రావాలనే ఉద్దేశంతో సచివాలయానికి ఆ మహానీయుడి పేరు పెట్టుకున్నామని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తామని హామీ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.