Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: థాయ్‌లాండ్ లో భారీ ఎత్తున జరుగుతున్న గ్యాంబ్లింగ్ ను అక్కడి థాయ్‌లాండ్ పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక మీడియా ఓ కథనం ప్రకారం పటాయాలోని ఓ లగ్జరీ హోటల్లో ఉన్న 93 మంది గ్యాంబ్లర్లను అరెస్టు చేస్తే, అందులో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయ్, నలుగురు మయన్మార్ దేశస్థులు ఉన్నట్టు వెల్లడించింది.
బాంగ్ లామంగ్ జిల్లాలోని ఆసియా పటాయా హోటల్లో సోమవారం తెల్లవారుజామున జరిపిన తనిఖీల్లో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పోలీసులు హోటల్లోకి ప్రవేశించిన సమయంలో పెద్ద సంఖ్యలో గ్యాంబ్లర్లు అక్కడ గేమ్‌లు నిర్వహిస్తున్నారు. వీరిని చూడగానే నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. నిందితుల నుంచి రూ.1.60లక్షల భారతీయ కరెన్సీ, 20 కోట్ల గ్యాంబ్లింగ్ చిప్స్, 92 మొబైల్ ఫోన్లు, 8 సీసీటీవీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటల్లో సుమారు రూ.100కోట్ల మేర గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టు పోలీసులు అంచనా వేశారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు హోటల్లో సోదాలు జరపగా ఈ గ్యాంబ్లింగ్ గుట్టు బయటపడినట్టు తెలుస్తోంది. ఈ గ్యాంబ్లింగ్‌కు ఉపయోగించిన పరికరాలన్నింటినీ భారత్ నుంచే తీసుకొచ్చినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.