Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన కార్యాలయంలో ప్రశ్నిస్తోంది. వీరిద్దర్నీ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు. ప్రధానంగా నగదు లావాదేవీలపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదుచేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. తొలుత న్యాయస్థానం నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న ఈడీ ఆ వివరాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదుచేసింది. అనంతరం తొలుత టీఎస్పీఎస్సీ కార్యాలయం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్‌ఛార్జి శంకరలక్ష్మిని విచారించింది. శంకరలక్ష్మితో పాటు లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణకు నోటీసులు జారీచేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ విధివిధానాల గురించి.. ప్రశ్నపత్రాలు ఎలా కొట్టేశారనే విషయాలపై ఈడీ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులను చంచల్‌గూడ జైలులో విచారించిన ఈడీ అధికారులు వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఇప్పటివరకు రూ.38లక్షల లావాదేవీలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించారు. సిట్ దర్యాప్తు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ ఛైర్మన్, కార్యదర్శిని అధికారులు విచారిస్తున్నారు.