Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పరస్పరం సవాళ్లు విసురుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఇద్దరు ఆపై నడిరోడ్డు మీదికి వచ్చి బీరు సీసాలతో పరస్పరం దాడులకు దిగారు. పల్నాడు జిల్లా వినుకొండలోని కారంపూడి రోడ్డులో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీడీపీ కార్యకర్త షేక్ ఇమ్రాన్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టాడు. వైసీపీకి చెందిన అష్రాఫ్ దానికి ఘాటుగా బదులిచ్చాడు. అలా ఇద్దరి మధ్య ఫేస్‌బుక్‌లోనే వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత సవాళ్లు విసురుకున్నారు. శనివారం ఏడీబీ భవనం వద్ద అనుచరులతో కలిసి ఇద్దరూ గొడవపడ్డారు. ఆదివారం వీరి మధ్య మరోమారు గొడవ జరిగింది. కారంపూడి రోడ్డులో ఉన్న బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి ఇమ్రాన్ వచ్చాడు. విషయం తెలిసిన అష్రాఫ్ అక్కడికి వెళ్లి ఇమ్రాన్‌తో గొడవపడ్డాడు. అది పెరిగి పెద్దదైంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి సమక్షంలోనే ఇరు వర్గాల వారు కర్రలు, బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కార్యకర్త ఇమ్రాన్ సహా ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.