Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సీనియర్ సిటిజన్ల టికెట్లపై రాయితీని రద్దు చేయడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో రాయితీ రద్దు వల్ల రూ.2,242 కోట్లు అదనంగా ఆర్జించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆర్టీఐ దరఖాస్తుకు జవాబిస్తూ రైల్వే శాఖ అధికారులు ఈ వివరాలు తెలిపారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అదే సమయంలో రైల్వే శాఖ వృద్ధులకు ఇచ్చే టికెట్ రాయితీని ఎత్తేసింది. గతంలో రాయితీలో భాగంగా 60 ఏళ్లు పైబడిన పురుషులకు టికెట్ ధరలో 40 శాతం, 58 ఏళ్లు పైబడిన మహిళలకు టికెట్ ధరపై 50 శాతం మినహాయింపు కల్పించింది. ఈ రాయితీని ఇప్పటి వరకూ పునరుద్ధరించలేదు. దీనివల్ల రైల్వేకు భారీ మొత్తంలో అదనపు ఆదాయం లభిస్తోందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు అమ్మిన టికెట్లతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.5,062 కోట్లు వచ్చాయని రైల్వే వెల్లడించింది. ఇందులో సీనియర్ సిటిజన్లయిన పురుషుల నుంచి రూ.2,891 కోట్లు, మహిళల నుంచి రూ.2,169 కోట్లు, ట్రాన్స్ జెండర్ల నుంచి రూ.1.03 కోట్లు ఉన్నాయి. మొత్తంగా రాయితీ రద్దుతో రైల్వేకు రూ.2,242 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. కాగా, సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలని, ఈమేరకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం.. పిటిషన్ ను కొట్టేసింది.