Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. నాలాలో పడి చిన్నారి మౌనిక చనిపోయిన సంగతి మరవకముందే మరో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో నీటి గుంతలో పడి ఆరేళ్ల బాలుడు వివేక్ మరణించాడు. స్నేహితులతో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ గుంతలో పడి మునిగిపోయాడు. అక్కడికి దగ్గర్లోనే ఉన్న బాలుడి తల్లిదండ్రులు వచ్చి బయటకు తీసేలోగా ఊపిరి అందక కన్నుమూశాడు. రోడ్డుపై నిలిచే వరద నీటిని తొలగించడం కోసం తీసిన గుంత ఈ ప్రమాదానికి కారణమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ గుంత నిండిపోయిందని, దానిపై ఉన్న కర్రమీదికి ఎక్కే ప్రయత్నంలో పట్టుతప్పి వివేక్ నీటి గుంతలో పడిపోయాడని తోటి పిల్లలు చెబుతున్నారు. అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ షోరూంలో వివేక్ తల్లిదండ్రులు పనిచేస్తారని సమాచారం. వివేక్ గుంతలో పడిపోయాడని పిల్లలు వచ్చి చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు పరుగెత్తుకెళ్లారు. గుంతలో నుంచి వివేక్ ను బయటకు తీయగా.. అప్పటికే వివేక్ లో చలనం ఆగిపోయిందని స్థానికులు తెలిపారు.