Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం ముళ్‌బాగల్ అనే ప్రాంతానికి వెళ్తుండగా ఆయన హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ అద్దం పగిలింది. దీంతో హెలికాప్టర్‌ను బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు సమాచారం. ఈ ఘటనలో ఆయనతోపాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడితో పాటు పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంపై డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం జక్కూరు నుంచి ముళ్బాగల్కు వెళ్తుండగా హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ప్రమాదం జరిగిందన్నారు. కన్నడ ప్రజల ఆశీర్వాదం వల్ల తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని పేర్కొన్నారు. తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో సురక్షితంగా బయటపడ్డామని పేర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు తెలిపారు.