Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
గ్రేటర్ వరంగల్లో ఓ వివాహితపై సామూహిక లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ ఏనుమాముల పోలీసు స్టేషన్లో ఏసీపీ కృపాకర్ మంగళవారం వెల్లడించారు. ‘‘స్థానిక పైడిపెల్లి గ్రామానికి చెందిన బాధితురాలు గత నెల 20న తోటి గ్రామస్థురాలితో కలిసి ఆరెపల్లి గ్రామానికి బయలుదేరారు. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన రవి, చల్వాయికి చెందిన నాగరాజులు కారులో వచ్చి వారిద్దరినీ అపహరించారు. ములుగు వైపు వెళ్లే దారిలో గ్రామస్థురాలిని దించేసిన నిందితులు, కొంచెం దూరం వెళ్లిన తర్వాత హన్మకొండకు చెందిన లక్ష్మణ్, జంగాలపల్లికి చెందిన రమేష్, వర్దన్నపేట ఫిరంగిగడ్డకు చెందిన సుధాకర్ అనే ముగ్గురిని కారులో ఎక్కించుకున్నారు.
బాధితురాలిని బెదిరించి కారును మేడారం అటవీ ప్రాంతంవైపు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై ముగ్గురు కలిసి లైంగికదాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఈ అకృత్యానికి సహకరించారు. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించి, ములుగులో బస్సు ఎక్కించారు. బస్సు దిగిన అనంతరం భర్తకు భయపడి కరీంనగర్లోని తన తల్లికి బాధితురాలు వెళ్లింది. ఎట్టకేలకు గత నెల 29న పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాం. వారిపై గ్యాంగ్ రేప్, అట్రాసిటీ కేసులను నమోదు చేసి రిమాండ్కు తరలించాం’’ అని ఆయన తెలిపారు.