Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 287 పాయింట్ల నష్టంతో 61,066 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 87 పాయింట్లు నష్టపోయి 18,060 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పుంజుకొని 81.77 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్ రంగంలో వచ్చిన సంక్షోభం అక్కడి సూచీలను కలవరపెడుతోంది. ఈ తరుణంలో వడ్డీరేట్లను పెంచేందుకు ఫెడరల్ రిజర్వ్ సిద్ధమైందన్న వార్తలు అక్కడి మదుపర్లను భయపెట్టింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పడిపోతున్నాయి. ఇవన్నీ రాబోయే ఆర్థిక మాంద్యానికి సంకేతాలన్న వాదన బలపడుతోంది. భారత కాలమానం ప్రకారం నేటి అర్ధరాత్రి వడ్డీరేట్లపై ఫెడ్ నిర్ణయం వెలువడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆసియా- పసిఫిక్ సూచీలు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. దేశీయంగా బలమైన సంకేతాలే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లు మన సూచీలను ప్రభావితం చేస్తున్నాయి.