Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రైతు బీమా తరహాలోనే కల్లు గీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కల్లు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. గీత కార్మికుల బీమా అంశంపై చర్చించారు.
వారం రోజుల్లో గీత కార్మికుల కుటుంబాలకు బీమా: కల్లు గీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారి పడి.. ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట ఘటనలు జరుగుతుంటాయన్న సీఎం.. ఇలా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న పరిహారం.. బాధితులకు చేరడంలో జాప్యం జరుగుతోందని తెలిపిన సీఎం కేసీఆర్.. రైతు బీమా తరహాలోనే వారం రోజుల్లో గీత కార్మికుల కుటుంబాలకు బీమా సొమ్ము అందే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని ఆర్థిక, ఎక్సైజ్ శాఖల మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్‌ను కేసీఆర్ ఆదేశించారు. అదే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించడం పట్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి.. బీమా నిర్ణయంతో కల్లు గీత వృత్తికి పూర్వ వైభవం వస్తుందన్నారు.