Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయనగరం
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ‘‘మూడేళ్లలో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తవుతుంది. మళ్లీ 2026లో మీ బిడ్డ జగన్ ఇక్కడికి వచ్చి ఎయిర్ పోర్టును ప్రారంభిస్తాడు’’ అని ధీమా వ్యక్తం చేశారు. భోగాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. విప్లవాల గడ్డ అయిన ఉత్తరాంధ్ర.. ఇక మీదట అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని సీఎం అన్నారు. ‘‘శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. 24 నెలల్లో మూలపేట పోర్టు పూర్తవుతుంది. ఓడలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్రకు మూలపేట పోర్టు మణిహారం అవుతుంది. భోగాపురం కిరీటం కాబోతోంది’’ అని చెప్పుకొచ్చారు. స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడికే వస్తారని జగన్ చెప్పారు.
ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరెన్ని కుట్రలు పన్నినా తనను ఏమీ చేయలేరని జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్జీటీల్లో కేసులు పరిష్కరించుకుని ఇవాళ శంకుస్థాపన చేశామన్నారు.