Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు చేపడుతున్న ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలో న్యాయం కోసం ధర్నా చేస్తున్న రెజ్లర్లను భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పరామర్శించారు. జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి బుధవారం ఉదయం పీటీ ఉష వెళ్లారు. ఈ సందర్భంగా టాప్ రెజ్లర్లతో మాట్లాడి.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పీటీ ఉషతో భేటీ అనంతరం రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడారు. రెజ్లర్లకు అండగా నిలబడి న్యాయం చేస్తానని పీటీ ఉష చెప్పిందన్నారు. తమ సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా బజరంగ్ పునియా స్పష్టం చేశారు.
కాగా, రెజ్లర్ల ఆందోళనను ఇటీవల పీటీ ఉష తప్పుబట్టిన విషయం తెలిసిందే. భారత ప్రతిష్టను వారు దిగజార్చుతున్నారంటూ తీవ్ర వ్యాఖల్యు చేశారు. 'క్రీడాకారులు ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం తగదు. కమిటీ రిపోర్ట్ వచ్చే వరకైనా వారు వేచి ఉండాల్సింది. వారు చేసిన పని క్రీడకు, దేశానికి మంచిది కాదు. ఇది ప్రతికూల విధానం' అని విమర్శించారు. రెజ్లర్లు నిరసన చేయడం క్రమశిక్షణారాహిత్యమని అన్నారు. పీటీ ఉష వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ నేతలు సైతం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్ల గురించి తక్కువగా మాట్లాడడం అవమానకరం అంటూ మండిపడ్డారు. మరోవైపు ఉష వ్యాఖ్యలపై రెజ్లర్లు కూడా మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లను పీటీ ఉష పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది.