Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి పౌరుడికి సత్వరమే సేవలు అందించాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరంలో వార్డుల పాలన పద్ధతి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చర్యలు ప్రారంభించారు. సచివాలయంలో పురపాలక శాఖపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే హైదరాబాద్లో వార్డు పాలన పద్ధతికి శ్రీకారం చుడుతామని ప్రకటించారు. జీహెచ్ఎంసీలో 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. మే నెలఖారున ఈ వార్డు కార్యాలయాలు ప్రారంభిస్తామని చెప్పారు. పాలన వికేంద్రీకరణతో పౌరులకు వేగంగా పరిపాలన ఫలాలు అందాలి. వార్డు కార్యాలయంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారు. సర్కిల్, జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా వార్డు కార్యాలయంలోనే సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం. సిటిజన్ ఫ్రెండ్లీగా జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు ఉండాలి. ప్రతి వార్డు ఇంకో వార్డు కార్యాలయంతో అనుసంధానం కావాలని కేటీఆర్ సూచించారు.