Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ శాలిబండ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు గ్రామానికి చెందిన డీ సురేఖ(24) 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని షంషీర్‌గంజ్‌లో తన సోదరితో కలిసి ఉంటుంది సురేఖ. సోమవారమే సురేఖకు నిశ్చితార్థం జరిగింది. మంగళవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. ఇక బుధవారం ఉదయం 11 గంటల సమయంలో సురేఖ సోదరి పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ తర్వాత సురేఖ డోర్ లాక్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం వరకు కూడా సురేఖ బయటకు రాకపోవడంతో.. ఇంటి ఓనర్‌కు అనుమానం వచ్చింది. దీంతో ఓనర్ ఆమె సోదరికి సమాచారం అందించాడు. ఇంటికొచ్చిన సోదరి స్థానికుల సాయంతో డోర్ పగులగొట్టి చూడగా, సురేఖ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. దీంతో సురేఖ సోదరి శాలిబండ పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే సురేఖ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.