Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై విజయవాడ దుర్గ గుడి సూపరింటెండెంట్ వాసా నగేష్ ఇంటిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్ అపార్టుమెంట్లోని ఆయన నివాసంతోపాటు ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని సన్నిహితులు, బంధువుల ఇళ్లలో బుధవారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. అనిశా అధికారులు తన బంధువులు, సన్నిహితుల గురించి ఆరా తీస్తున్నారన్న సమాచారం రావడంతో సూపరింటెండెంట్ ముందుగానే సెలవు పెట్టారు. సెలవులో ఉన్నప్పటికీ అనిశా అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కుమ్మరిపాలెం సెంటరులో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించారు. నగేష్ గతంలో ద్వారకా తిరుమలలో పని చేసిన సమయంలో గుత్తేదారుల నుంచి వసూలు చేసిన జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో ఆర్జేసీ స్థాయి అధికారి విచారణ చేశారు. ఆ వ్యవహారంలో ఆయన్నుంచి డబ్బులు రికవరీ చేశారు. గతంలో శాఖాపరమైన విచారణ చేసిన ఆర్జేసీ భ్రమరాంబ ప్రస్తుతం దుర్గగుడి ఈవోగా ఉన్నారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.