Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్ల దీక్షా శిబిరం వద్ద బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, రెజ్లర్ల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. నిరసనకారుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి తీసుకొచ్చిన మంచాలు ఈ ఉద్రిక్తతలకు తెరలేపాయి.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్ల కోసం ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వాటిని రెజ్లర్లకు ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో సోమ్‌నాథ్ అనుచరులు వాగ్వాదానికి దిగారు. వీరికి రెజ్లర్లకు కూడా తోడవడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై దాడికి పాల్పడ్డారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ‘‘వర్షాల కారణంగా మా పరుపులు తడిచిపోయాయి. అందుకే మడత మంచాలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ పోలీసులు అనుమతించలేదు. కొందరు పోలీసులు మద్యం మత్తులో మహిళా రెజ్లర్లను అవమానించేలా మాట్లాడారు. మాపై దాడి చేశారు. ఈ ఘటనలో భజ్రంగ్ పునియా బావ దుష్యంత్, మరో ఇద్దరు గాయపడ్డారు’’ అని మాజీ రెజ్లర్ రాజ్వీర్ ఆరోపించాడు. అటు భజ్రంగ్ పునియా భార్య సంగీత ఫొగాట్, వినేశ్ ఫొగాట్ కూడా ఇదే విధమైన ఆరోపణలు చేశారు. మహిళా పోలీసులు లేరని, కొందరు పోలీసులు తమను తోసేశారని తెలిపారు.