Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. ఈ నెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో 7న అదే ప్రాంతంలో ఆల్పపీడనం ఏర్పడవచ్చని తెలిపింది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై ఈనెల 9 నాటికి తుఫానుగా బలపడవచ్చని చెప్పింది. ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ బంగాళాఖాతం వైపు కదులుతూ తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతంలో తరచూ తుఫానులుగా ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దేశంలో అక్టోబరు-డిసెంబర్ మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుఫాను సీజన్ ఉంటుంది. వీటికి తోడు పశ్చిమతీరంలోని అరేబియాసముద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయి.