Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉక్రెయిన్
తమ దేశ అధ్యక్ష భవనంపై దాడి నేపథ్యంలో రష్యా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఉక్రెయిన్ నగరం ఖేర్సన్ లోని సివిలియన్ టార్గెట్లపై బాంబుల వర్షం కురిపించింది. ఓ సూపర్ మార్కెట్ తో పాటు రైల్వే స్టేషన్ పై మిసైల్ దాడి చేయడంతో 21 మంది పౌరులు చనిపోయారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. గురువారం ఉదయం కీవ్ లో కూడా రెండు భారీ పేలుళ్లు సంభవించాయని తెలిపింది. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు పోరాడుతున్నామని కీవ్ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ను ఉటంకిస్తూ కీవ్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.
రష్యా ఆర్మీ మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం ఉందని కీవ్ మిలటరీ అధికారులు హెచ్చరించారు. పౌరులు బయటకు రావద్దని, తమ షెల్టర్లకే పరిమితం కావాలని సూచించారు. కీవ్ లో ఎయిర్ రైడ్ అలర్ట్ జారీ చేశారు. రాజధానితో పాటు ఖేర్సన్, చెర్నిహివ్, సుమీ, పోల్టోవా, కిరోవోహ్రాద్, ఖార్కివ్, మికొలైవ్, ఒడెస్సా, ద్నిప్రొపెట్రోవ్స్క్, జపొరిజియా రీజియన్లలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రష్యా అధ్యక్ష భవనంపై డ్రోన్ అటాక్ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. అయితే, క్రెమ్లిన్ పై డ్రోన్ దాడికి తమకు సంబంధంలేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ స్పష్టం చేశారు. తమ సరిహద్దుల్లో రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కొంటున్నామని, సరిహద్దుల్లోని తమ ప్రజలను కాపాడుకోవడానికే పోరాడుతున్నామని వివరించారు. క్రెమ్లిన్ పై దాడి చేసేంత సాధనాసంపత్తి తమ వద్ద లేదని తెలిపారు.