Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: కాషాయ పాలకులు దేశ చరిత్రను మార్చాలని కోరుకుంటున్నారని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. చరిత్రను తిరగరాయాలనే బీజేపీ కుయుక్తులను అడ్డుకునేందుకే తాను విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని, ప్రతి ఒక్కరి బాగు కోసమే తాను పరితపిస్తానని చెప్పుకొచ్చారు.
తన కోసం తాను ఏమీ చేయడం లేదని బీహార్ సీఎం స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ను మట్టికరిపించేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ఇటీవల ముమ్మరమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మార్పు ఖాయమని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల స్పష్టం చేశారు. గత పదేండ్లుగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. కేంద్రంలో కాషాయ సర్కార్ చరిత్రను మార్చడం, ఎన్ఆర్సీ పేరుతో అన్యాయం చేయడం మినహా మోడీ సర్కార్ ప్రజల కోసం పాటుపడిందేమీ లేదని దీదీ దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీ సర్కార్ను నిలువరించాలని కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మట్టికరుస్తుందని అన్నారు. విపక్షాలు ఏకమైతే బీజేపీ ఓటమిపాలవుతుందని, విభజిత శక్తులపై భారత్ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు రేపుతున్న బీజేపీ కుయుక్తులను ఎండగడుతూ ప్రజలంతా ఏకం కావాలని దీదీ పిలుపు ఇచ్చారు.