Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని ఏపీ భవన్ ను తమకు ఇచ్చేయాలని తెలంగాణ కోరుతున్న సంగతి తెలిసిందే. ఏపీ భవన్ తో తమ భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని తెలంగాణ అంటోంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్ ను తెలంగాణ తీసుకోవాలని కోరింది. మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమిని ఏపీ తీసుకోవాలని పేర్కొంది. గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ ను కూడా ఏపీనే తీసుకోవాలని కేంద్రం సూచించింది.
ఒకవేళ ఏపీకి అదనపు భూమి దక్కితే, ఆ మేరకు తెలంగాణకు ఏపీ భర్తీ చేయాలని తెలిపింది.
ఏప్రిల్ 26న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీ వివరాలను కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల అధికారులకు పంపింది. భూములు, భవనాల విభజనపై ఏపీ గతంలో మూడు ప్రతిపాదనలు చేసింది. ఈ నేపథ్యంలో, ఆస్తుల పంపకంపై తెలంగాణ నుంచి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. గోదావరి, శబరి బ్లాకులు తమకు ఇవ్వాలని తెలంగాణ కోరింది. నర్సింగ్ హాస్టల్, పక్కనే ఉన్న ఖాళీ స్థలం తమకు ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే, తాజాగా కేంద్రం చేసిన ప్రతిపాదన తెలంగాణ ప్రతిపాదనకు పూర్తి విరుద్ధంగా ఉంది. విభజన నేపథ్యంలో, ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం చెబుతోంది.