Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వేములవాడ
జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్(29) గురువారం మృతి చెందారు. కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో ముగ్గురు జవాన్లతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు నదిలో కూలిపోయింది. ఆ ముగ్గురిలో అనిల్ మృతి చెందగా ఇద్దరికి గాయాలైనట్టు తెలిసింది. మలాపూర్ గ్రామానికి చెందిన పబ్బాల లక్ష్మి-మల్లయ్యకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు అనిల్ 2011లో సైన్యంలో చేరి టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నారు. అనిల్‌కు భార్య సౌజన్య, కొడుకులు ఆయాన్, అరవ్ ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో అనిల్ మృతి చెందిన విషయం తెలిసిన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
దీంతో మల్కాపూర్ గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. గత నెలలో పెద్ద కొడుకు పుట్టినరోజు వేడుకలతోపాటు అత్తగారి ఊరు కోరెంలో జరిగిన బీరప్ప పట్నం పండుగ ఉన్నందున.. అనిల్ 15 రోజుల క్రితం గ్రామానికి వచ్చి వెళ్లాడని గ్రామస్థులు పేర్కొన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అనిల్‌కు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.