Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్యకేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. 2007లో జరిగిన ఈ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొని నిర్దోషిగా విడుదలైన సత్యంబాబును అప్పట్లో అరెస్ట్ చేయాల్సిన కారణాల గురించి ఆరా తీస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్ నగర కమిషనరేట్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు గురువారం పలు వివరాలు సేకరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన శ్రీనివాసులు రాత్రి 8 గంటలకు బయటికి వచ్చారు. ఆయన నుంచి 8 గంటలపాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని దుర్గా లేడీస్ హాస్టల్లో ఆయేషామీరా హత్య జరిగిన సమయంలోనే నందిగామ పరిసరాల్లో మరిన్ని నేరాలు నమోదయ్యాయి. ఆ సమయంలో శ్రీనివాసులు నందిగామ డీఎస్పీగా ఉన్నారు. నందిగామ ప్రాంతంలో జరిగిన వరుస నేరాలను దర్యాప్తు చేసేందుకు అప్పటి తూర్పుగోదావరిజిల్లా అదనపు ఎస్పీగా ఉన్న ఎ.వి.రంగనాథ్(వరంగల్ ప్రస్తుత కమిషనర్)ను అక్కడికి పంపించారు. దర్యాప్తులో భాగంగా అప్పటికే మరో కేసులో అరెస్టై జైల్లో ఉన్న సత్యంబాబును విచారించి.. ఆయేషామీరా హత్య కేసుతో సంబంధమున్నట్లు పోలీసులు భావించి అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాల్ని శ్రీనివాసులు సైతం పర్యవేక్షించారు. అయితే ఆయేషామీరా హత్యకేసులో సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసిన నేపథ్యంలో హత్య ఎవరు చేశారని తేల్చేందుకు సీబీఐ మరోసారి దర్యాప్తు ఆరంభించింది. ఇందులో భాగంగానే అప్పటి కేసుకు సంబంధించి శ్రీనివాసులు నుంచి సీబీఐ అధికారులు గురువారం వాంగ్మూలం సేకరించారు.