Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 61,481 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 18,181 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, నెస్లే ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, మారుతీ, ఐటీసీ, ఎంఅండ్ఎం, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ఆరంభంలోని భారీ నష్టాల నుంచి తేరుకున్నప్పటికీ.. చివరకు నష్టాలతోనే ముగిశాయి. ఆసియా పసిఫిక్ సూచీలు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికా బ్యాంకింగ్ షేర్లలో వస్తున్న అమ్మకాలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. చమురు ధరలు గురువారం స్వల్పంగా మారాయి. బ్రెంట్ బ్యారెల్ ధర 0.24 శాతం పెరిగి 72.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. విదేశీ మదుపర్లు గురువారం రూ.1,414 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ మదుపర్లు సైతం రూ.441.56 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.