Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా
అమెరికా వైద్యులు తాజాగా ఓ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా గర్భస్థ శిశువుకు విజయవంతంగా మెదడు ఆపరేషన్ నిర్వహించారు. బోస్టన్లోని బ్రిగ్హామ్ అండ్ వుమన్స్ హీస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుల బృందం ఈ అరుదైన ఆపరేషన్ నిర్వహించింది. లూసియానాకు చెందిన ఓ మహిళకు అల్ట్రాసౌండ్ పరీక్ష నిర్వహించగా ఆమె కడుపులోని పిండం మెదడులోని రక్తనాళంలో లోపం ఉన్నట్టు బయటపడింది. శాస్త్రపరిభాషలో ఈ సమస్యను గాలెన్ మాల్ఫార్మేషన్ అని అంటారు.
ఈ సమస్య బారిన పడ్డ శిశువుల్లో గుండె, మెదడు సంబంధిత రుగ్మతలు తలెత్తి మరణిస్తారని వైద్యులు తెలిపారు. అయితే, శస్త్రచికిత్స ద్వారా వైద్యులు రక్తనాళంలోని లోపాన్ని చక్కదిద్దడంతో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఏడు వారాల క్రితం ఈ సంక్లిష్ట బ్రెయిన్ సర్జరీ జరగ్గా ప్రస్తుతం తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతితో వైద్యులు ఈ ప్రయోగాత్మక శస్త్రచికిత్స నిర్వహించారు.