Authorization
Sat April 05, 2025 01:12:40 am
నవతెలంగాణ - హైదరాబాద్: గుండె సమస్యలు అంటేనే క్లిష్టమైనవి. అందులోనూ చిన్నారుల గుండె సమస్యలంటే చెప్పనవసరం లేదు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రముఖ చిన్నపిల్లల దవాఖాన నిలోఫర్‌కు నిత్యం పదుల సంఖ్యలో ఈ సమస్యలకు సంబంధించిన కేసులు వస్తుంటాయి. ఇప్పటివరకు ఆ కేసులను ఉస్మానియాకు పంపేవారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో నిరుడు జనవరిలో చిన్నపిల్లల గుండె సమస్యలకు ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో సమస్యలను గుర్తించేందుకు అవసరమైన 2డి ఎకో పరీక్షలు చేయడం, శస్త్రచకిత్సలు అవసరమైన వారిని నిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. ఇకనుంచి నిలోఫర్‌లోనే చిన్నపిల్లల గుండె వైద్యసేవలను పూర్తిస్థాయిలో అందించేందుకు ‘శ్రీసత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ ముందుకొచ్చింది.
నిలోఫర్‌లోనే పూర్తిస్థాయి సేవలు: డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్
నిలోఫర్‌లో చిన్నపిల్లలకు పూర్తిస్థాయి గుండె సమస్యల చికిత్స, అన్ని రకాల పరీక్షలు, చిన్నపాటి సర్జికల్ ప్రొసీజర్లు సైతం ఇక్కడే నిర్వహించే అవకాశం ఉన్నదని నిలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి చెప్పారు. ఈ సేవలను ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, సినీ నటుడు సుమన్‌తో కలిసి మంగళవారం ప్రారంభించనున్నట్టు వివరించారు. చిన్నపిల్లల గుండె వైద్యంతోపాటు శస్త్రచికిత్సలు చేసేందుకు శ్రీసత్యసాయి ట్రస్ట్ సిద్దిపేటలో శ్రీసత్యసాయి సంజీవని హాస్పిటల్ ఏర్పాటు చేసిందని, ఇకనుంచి నిలోఫర్‌లోని గుండె సమస్యలున్న చిన్న పిల్లలకు శస్త్రచికిత్సల కోసం నిమ్స్‌తోపాటు సిద్దిపేటలోని శ్రీసత్యసాయి సంజీవిని దవాఖానకు రెఫర్ చేస్తామనని తెలిపారు.