Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తన తల్లికి ప్రేమతో ఒక కుమారుడు ఏకంగా ఆలయం నిర్మిస్తున్నాడు. తన తల్లి తమ నుంచి దూరమైనా అమె జ్ఙాపకాలు కలకాలం గుర్తుండేలా గుడిని తీర్చిదిద్దుతున్నాడు.. వివరాలలోకి వెళితే సనపల శ్రావణ్ కుమార్ తల్లితండ్రులు క్రిష్ణావు, అనసూయా దేవి. ప్రస్తుతం శ్రావణ్ కుమార్ హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్నారు. 2008 లో ఆయన తల్లి కన్నుమూసారు. దీంతో తల్లికి గుర్తుగా శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామం చీమలవలసలో రూ 10 కోట్లతో 2019 మార్చిలో గుడి నిర్మాణం ప్రారంభించారు. ఇందుకోసం కృష్ణ శిలను మాత్రమే వాడుతున్నారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. యాదాద్రి ఆలయ నిర్మాణ స్తపతుల్లో ఒకరైన బలగం చిరంజీవి, తమిళనాడుకు చెందిన శిల్పి పాండీదురై, ఒడిశాకు చెందిన శిల్పాకారుల ఆధ్వర్యంలో గుడి నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రధాన గోపురం ఎత్తు 51 అడుగులు ఉండటంతో పాటు పంచగోపురాలను నిర్మిస్తున్నారు. మూలవిరాట్టుగా మాతృమూర్తి విగ్రహాన్ని, శిలలపై ప్రాచీన నగిషీలతో కట్టడాలు చేపట్టారు. అమ్మ ప్రేమ గొప్పతనంపై చిత్రాలను ఆలయం మండప స్తంభాలపై చెక్కుతున్నారు. ఆలయం ప్రత్యేకతల అంశం వైరల్ గా మారుతోంది. తల్లి కోసం గుడిని నిర్మిస్తున్న శ్రావణ్ కుమార్ ను గ్రామస్థులు అభినందిస్తున్నారు.