Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెల్లిని ప్రేమించాడని సోదరుని ఘాతుకం
నవతెలంగాణ-వీణవంక
ప్రేమించిన పాపానికి మరో ప్రణయ్ బలయ్యాడు. చెల్లిని ప్రేమించాడన్న కక్షతో ఆమె సోదరుడు యువకున్ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి(కల్లుపల్లె)లో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పోతిరెడ్డిపల్లికి చెందిన నరుకుడు ప్రణయ్(23) ట్రాక్టర్, హార్వెస్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ ఎస్సీ సామాజిక తరగతికి చెందిన వారే. ప్రేమ విషయం యువతి కుటుంబీకులకు తెలియడంతో ఇరు కుటుంబీకుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే, సోమవారం రాత్రి ఆ అమ్మాయితో ప్రణయ్ ఫోన్ లో మాట్లాడాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు నుద్దునూరి అనిల్ పలువురిని వెంట పెట్టుకుని ప్రణయ్ ఇంటికొచ్చి ఒక్కసారిగా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. అక్కడి నుంచి కొంత దూరం వరకు ఊడ్చుకెళ్లి ముళ్ల పొదల్లో పడేశారు. మంగళవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి డీసీపీ శ్రీనివాస్, సెక్షన్ ఐపీఎస్ రశ్మీపెర్మాల్ హుజురాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు, సీఐలు రాములు, కిరణ్, సృజన్ రెడ్డి, ఎస్ఐ కిరణ్‌రెడ్డితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. మృతుడి తల్లిదండ్రులు పద్మ, మొగిళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ కిరణ్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.