Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుఫానుతో పంటలు ఆగం
- పలుచోట్ల నేలకొరిగిన వరి..
- దెబ్బతింటున్న ధాన్యం, పత్తి
- చలితో వణుకుతున్న జనం
నవ తెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఏడాది అధిక వర్షాలు రైతులను దెబ్బమీద దెబ్బతీస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు నివర్తో కలిపి పది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. నివర్ తుఫాన్ వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రంపై మబ్బులు కప్పేశాయి. రెండ్రోజులుగా జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు పడటంతోపాటు ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ముసురు మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండ్రోజులుగా నివర్ తుఫాను రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. భారీ ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి నేలకొరిగింది. దూది పింజల్లోకి వర్షపు నీరు చేరి పంట నాణ్యత దెబ్బతింటోంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంపైన టార్ఫాలిన్లు, పట్టాలు కప్పినా కిందకు వర్షపు నీరు చేరుతోంది. వడ్లు, అటు దూదిలోని గింజలు మొలకెత్తుతున్నాయి. తుఫానుకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో పొలాల్లో వరి నేలకొరిగింది.
అసలే చలికాలం..దీనికి తోడు వర్షం..ఆపై ఈదురుగాలితో జనం గజగజ వణుకుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలితో అల్లాడుతున్నారు. ఈ వర్షాలకు మిరప, కూరగాయ పంటలు కూడా తెగుళ్ల బారిన పడతాయని ఖమ్మం జిల్లా ఉద్యానశాఖ అధికారిణి అనసూయ తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా పంట నష్టాలు జరిగినట్లు సమాచారం లేదని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ప్రతినెలా అధిక వర్షాలే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతినెలా అధిక వర్షాలే నమోదవుతున్నాయి. ఖరీఫ్ ఆరంభం జూన్ నుంచి అక్టోబర్ వరకు సగటు కన్నా ఎక్కువ వర్షాలే కురుస్తున్నాయి. తాజాగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 260.2 మి.మీ వర్షం కురిసింది. అత్యధికంగా దమ్మపేటలో 47.4 మి.మీ వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం జూన్ 1 నుంచి నవంబర్ వరకు 1924.1 మి.మీ కాగా నేటి వరకు 32,709.9 మి.మీ వర్షం పడింది. శుక్రవారం 11 మండలాల్లో 1 నుంచి 3 సెం.మీలోపు వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 1 నుంచి 3 సెం.మీ లోపు 18 మండలాల్లో కురిసింది. జిల్లాలో 404 మి.మీ వర్షం పడింది. అత్యధికంగా పెనుబల్లి మండలంలో 32 మి.మీ వర్షం కురిసింది. నివర్ ముసురు తాకిడికి పంటలు దెబ్బతినకుండా రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో నమోదైన అధిక వర్షపాతం వివరాలు (మి.మీ)
నెల భద్రాద్రి ఖమ్మం
జూన్ 38.4 79.9
జూలై 21.9 18.8
ఆగష్టు 181.5 52.2
సెప్టెంబర్ 83.5 57.2
అక్టోబర్ 106.8 84.3