Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్)పై ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాలను పున:పరిశీలించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) డిమాండ్ చేసింది. ఈ మేరకు టిప్స్ కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, వేముల శేఖర్, నగేశ్, రహీం, సమన్వయకర్త ఎం జంగయ్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వారికి టీడీఎస్ రూపంలో వేతనం నుంచి 10 శాతం మినహాయించాలని ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాత టీడీఎస్ మీద నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకులు టీడీఎస్ పరిధిలోకి రాబోరని వివరించారు. కాంట్రాక్టు అధ్యాపకులు నేరుగా ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటున్నారని తెలిపారు. ఇది అదనపు ఆదాయం కాదనీ, ఏడాదికి ఒకేచోట పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, కాంట్రాక్టు అధ్యాపకులకు మధ్య ఎంపాయర్, ఎంప్లాయి సంబంధం ఉందని వివరించారు. వారి వేతనాలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 192 పరిధిలోకి వస్తాయనీ, 194(జె) పరిధిలోకి రావని తెలిపారు. ఐటీ శాఖ డ్రాయింగ్ అధికారులకు పంపిన నోటీసులకు పై విధంగా సమాధానం పంపి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం కట్ అయ్యే టీడీఎస్‌కు బాధ్యులు డ్రాయింగ్ అధికారులా? లేక కమిషనరా?అని ప్రశ్నించారు. టీడీఎస్ కట్ చేయకుండా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలనీ, వారికి వేతనాలు విడుదల చేయాలని సూచించారు.
ఆదేశాలు బాధాకరం : ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం
కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల నుంచి టీడీఎస్ మినహాయించాలని ఇంటర్ విద్యా కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు బాధాకరమని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమార్ తెలిపారు. ఏప్రిల్ నుంచి రికవరీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. నెలనెలా వేతనాలు ఇవ్వకుండా టీడీఎస్ ఎలా కట్టాలని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ కాంట్రాక్టు అధ్యాపకులకు టీడీఎస్ నుంచి మినహాయింపు ఉందని వివరించారు. ఆదాయపు పన్ను పరిధిలోకి కాంట్రాక్టు అధ్యాపకులను తీసుకురాకుండా కమిషనర్ కృషి చేయాలని సూచించారు.