Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో హక్కులను సాధించుకోవాలని శాసనమండలి సభ్యులు అల్టుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం వీరనారి ఐలమ్మ 36వ వర్థంతి సభ జరిగింది. ఈ సభకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం భూస్వాములను ఎదిరించి పోరాడిన వీరనారి ఐలమ్మ అని చెప్పారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు. నాటి పోరాట ఫలితంగానే పేదలందరికీ భూములు దక్కాయని గుర్తుచేశారు. కౌలు రైతులకు, వృత్తిదారులకు భూములపై హక్కులు దక్కాయని వివరించారు. నేటి పాలకులు మాత్రం ప్రభుత్వ భూములను పెట్టుబడిదారులకు, ధనవంతులకు అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు.వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను, ఐలమ్మ జీవితాన్ని నేటి తరానికి తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు.తెలంగాణ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం.వీ రమణ మాట్లాడుతూ వివిధ వృత్తిదారుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నిధులు కేటాయించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్.శ్రీరాంనాయక్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏఎల్ మల్లయ్య,డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తో పాటు మత్స్యకారుల కార్యదర్శి ఎ.శ్రీరాములు,సోషల్ మీడియా కన్వీనర్ ఆర్. ప్రభాకర్, ఎల్.సోమయ్య, పి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నరేష్ వందన సమర్పణ చేశారు.
చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ హర్షం
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం పట్ల చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎమ్వీ రమణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య, మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ ఒక ప్రకటన విడుదల చేశారు.